Type Here to Get Search Results !

వాయుసేనలో విశిష్ట కొలువులు!

వాయుసేనలో విశిష్ట కొలువులు!



భారతీయ వాయుసేనలో అత్యున్నత స్థాయిలో సేవలందించడానికి ఉన్న మార్గాల్లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్టు(ఏఎఫ్ క్యాట్) ముఖ్యమైంది. ఇందులో విజయవంతమైతే లెవెల్ 10 హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. సాధారణ డిగ్రీ లేదా బీటెక్ అర్హతతో పోటీ పడొచ్చు. ఇటీవలే వెలువడిన ఏఎఫ్ క్యాట్- 2025(2) వివరాలు.

ప్రతి ఆరు నెలలకూ ఏఎఫ్ క్యాట్ ప్రకటన వెలువడుతుంది. ఎయిర్ ఫోర్స్లో టెక్నికల్, నాన్ టెక్నికల్, ఫ్లయింగ్ బ్రాంచీల్లో పోస్టులకు నిర్వహించే ఈ పరీక్ష అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) అదనం. రాత పరీక్షలో అర్హులకు స్టేజ్-1, 2లకు అవకాశమిస్తారు. అందులోనూ నెగ్గితే, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు. అనంతరం ఎంపికైన పోస్టు. విభాగం ప్రకారం వీరిని శాశ్వత, 14 ఏళ్లపాటు కొనసాగే తాత్కాలిక ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు.

పరీక్ష ఇలా...

ఆన్లైన్లో 300 మార్కులకు నిర్వహిస్తారు. వంద ప్రశ్నలు. సరైన సమాధానానికి 3 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్ల్లో ప్రశ్నలొస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో, మిగిలినవి డిగ్రీ స్థాయిలో అడుగుతారు. వెబ్సైట్లో మాదిరి ప్రశ్నపత్రాలు ఉంచారు. పరీక్షకు ముందు ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టూ అందుబాటులోకొస్తుంది. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) అదనం. దీని వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున వీటికి 150 మార్కులు.

విజయానికి...

• ప్రకటనలోని సిలబస్ వివరాలు పరిశీలించి, వాటినే బాగా చదవాలి.

• ముందుగా అన్ని విభాగాల్లోనూ ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. అనంతరం విభాగాల వారీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.

• పరిమిత పుస్తకాలనే ఎంచుకుని, వాటినే విస్తృతంగా చదవాలి.

• పాత ప్రశ్నపత్రాలు గమనించాలి. వీటి నుంచి ప్రశ్నల స్థాయి, అంశాల వారీ లభిస్తోన్న ప్రాధాన్యాన్ని గ్రహించి, సన్నద్ధతను పరీక్షకు సరిపోయేలా మలచుకోవాలి.

• పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలు సాధించాలి. ఫలితాలు విశ్లేషించుకోవాలి. చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వెనుకబడుతోన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

• పరీక్షలో ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరలోనే ప్రయత్నించాలి. రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివాటిని వదిలేయాలి.

స్టేజ్ 1, 2 ఇలా...

రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు (ఏఎఫ్ఎస్బీ) నిర్వహిస్తుంది. స్టేజ్-1 స్క్రీనింగ్ టెస్టు ఇందులో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రాటింగ్ టెస్టు, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్టు ఉంటాయి. చిన్న అసైన్మెంట్లు, పజిల్స్ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేదస్సు పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపుతారు. దాన్ని విశ్లేషించాలి. ఇందులో అర్హత సాధించినవారికి స్టేజ్-2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండోర్, అవుట్ డోర్ ఇంటరాక్టివ్ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటి ద్వారా మానసిక, శారీరక సామర్ధ్యాన్ని గమనిస్తారు. తర్వాత ముఖాముఖి ఉంటుంది. ఈ దశలన్నీ దాటినవారికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏ సమస్యలూ లేనివారిని శిక్షణకు పిలుస్తారు.

శిక్షణ - వేతనం:

జులై, 2026 నుంచి శిక్షణ మొదలవుతుంది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగాల్లో సుమారు 62 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగాలకు 52 వారాలు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఈ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగంలో రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్ఎర్ఎ, పలు ఆలవెన్సులు ఉంటాయి. అలాగే మిలటరీ సర్వీస్ పే (ఎంఎస్పీ) లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు రూ. పాతిక వేల ఫ్లయింగ్ అలవెన్సు టెక్నికల్ బ్రాంచీలవారికి టెక్నికల్ అలవెన్సు అదనంగా అందుతాయి. అన్నీ కలిపి రూ. లక్షకు పైగా వేతనం లబిస్తుంది. ఇతర ప్రోత్సాహకాలూ, సౌకర్యాలూ ఉంటాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area