పరీక్షలో విజయానికి ఇలా చేద్దాం...
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు దగ్గర పడుతున్నాయి. దాదాపు విద్యార్థులంతా సన్నద్ధతలో నిమగ్నమయ్యారు. కొంతమందిని మాత్రం తెలియని భయాలు వెంటాడతాయి. అయితే ఇప్పటి నుంచైనా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎక్కువ మార్కులు, అధిక గ్రేడ్ పాయింట్లు సాధించవచ్చు.
భయానికి, ఒత్తిడికీ కారణాలు తెలుసుకోవడం ముఖ్యం. ఫెయిల్ అవుతానేమో అనే భయం ఉన్నవారు ఇప్పటి నుంచైనా శ్రద్ధగా చదివితే సులువుగా ఉత్తీర్ణత సాధిస్తాను అనుకోవాలి. ఇందుకోసం సిలబస్ మొత్తం చదవాల్సిన పని లేదు. ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే ఎక్కువ మార్కులు రావేమో అని మథన పడుతున్నవారు ఇంకా సమయం ఉంది. అన్నీ అన్నీ చదివితే తప్పకుండా పూర్తి మార్కులు పొందగలరని గ్రహించాలి.
▪️అకడమిక్ పరీక్షల్లో విజయానికి ముందు నుంచీ చదవలేకపోయినా చివరి రెండు నెలలు సద్వినియోగం చేసుకుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి వీలవుతుంది. గత ఐదేళ్ల ప్రశ్నపత్రాలను బాగా చదివినా సరిపోతుంది. దాదాపు సిలబస్ అంతా వీటితోనే కవర్ అవుతుంది. పునరావృతమయ్యే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయి.
▪️ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రోజువారీ ప్రణాళిక వేసుకోండి.. దీన్ని ఆదర్శనీయంగా కాకుండా, ఆచరణీయంగా ఉండేలా రూపొందించుకోవాలి.
▪️గతంలో తరగతులకు హాజరు కాకపోవచ్చు లేదా శ్రద్ధగా వినకపోవచ్చు. అయితే ఇప్పటి నుంచైనా తప్పనిసరిగా రివిజన్ క్లాసులు శ్రద్ధగా వినాలి. వీటి ద్వారా కాన్సెప్ట్ అర్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో సులువుగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఇంకా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి. స్నేహితుల సాయంతోనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
▪️చదివింది మర్చిపోకుండా ఉండటానికి మైండ్ మ్యాపింగ్, కాన్సెప్ట్ లెర్నింగ్ లాంటి వాటితో ఉపయోగం ఉంటుంది. విరామం లేకుండా చదివే బదులు పొమడారో టెక్నిక్ని అమలు చేయాలి. పెద్ద టాపిక్ ను చిన్న చిన్న భాగాలుగా చేసుకుని నేర్చుకోవచ్చు.
▪️ప్రీ ఫైనల్ పరీక్షల ద్వారా పబ్లిక్ పరీక్షలను సమర్థంగా ఎదుర్కోవచ్చు. వీటిని ఫైనల్ పరీక్షలుగా భావించి, తప్పనిసరిగా రాయాలి. ఈ పరీక్షల్లో చేసిన తప్పులు సరిదిద్దుకుంటే పబ్లిక్ పరీక్షల్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇంకా సమయం ఉంటే నమూనా పరీక్షలూ రాసుకోవచ్చు. కష్టమైన సబ్జెక్టుల్లో రాణించడానికి ఇవి తోడ్పడతాయి.
▪️పరీక్షలు రాసేటప్పుడు ముందు ప్రశ్నను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రెండు సార్లు జాగ్రత్తగా చదివితే అందులో దేని గురించి అడిగారో తెలుస్తుంది. దీంతో సులువుగా సరైన సమాధానం రాయడానికి వీలవుతుంది.
▪️సమాధానం తెలిస్తే సరిపోదు. అర్థమయ్యేలా రాయడం ఎంతో ముఖ్యం. అందువల్ల బాగా రాయడాన్ని సాధన చేయాలి. ముఖ్యమైన అంశాలను హైలైట్ చేయాలి. ఆకట్టుకునేలా పట్టికలు, బొమ్మలు వేయడం. ఇవన్నీ స్కోరును పెంచుతాయి.
▪️కొత్తగా నేర్చుకున్న ప్రశ్నలకు జవాబులు రాసి, మీరే సమీక్షించుకోండి. చేస్తోన్న చిన్నచిన్న పొరపాట్లు సరిదిద్దుకోండి. అలాగే ఎంత సమయంలో రాయగలుగుతున్నారో పరిశీలించండి. దీంతో అసలు పరీక్షలో సమయ నిర్వహణతో ఇబ్బంది ఉండదు.
▪️పరీక్షలో విజయానికి మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యం. అలాగే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం యోగా, ప్రాణాయామం లాంటివి ప్రయత్నించవచ్చు. ఏ విషయంలోనైనా ఆందోళనగా అనిపిస్తే ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులతో చర్చించడం ద్వారా ఉపశమనం పొందడానికి వీలవుతుంది. అవకాశం ఉన్నవారు కౌన్సెలర్ల సహాయాన్నీ తీసుకోవచ్చు.
▪️డిజిటల్ క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. పరీక్షల వరకూ మొబైల్ పక్కన పెట్టేయడమే మంచిది. అలాగే ఈ సమయంలో ఆన్లైన్ లెర్నింగ్నూ పరిమితం చేసుకుంటేనే ప్రయోజనం.
▪️పోషకాహారం తీసుకుంటూ, సమయానికి నిద్ర పోవడమూ ప్రధానమే. బయటి ఆహారం తీసుకోవద్దు. ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాలి.
▪️చివరిగా పబ్లిక్ పరీక్షల ముందు నేర్చుకున్నవన్నీ పునశ్చరణ చేయడం ఎంతో అవసరం. ఇలా జరిగితేనే తప్పులు లేకుండా, వేగంగా సమాధానం రాయగలరు.
.jpeg)