Type Here to Get Search Results !

అధిక ఆలోచనలతోనే ముప్పు (అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా)

 అధిక ఆలోచనలతోనే ముప్పు (అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా)



యం. రాం ప్రదీప్

జేవివి సభ్యులు, తిరువూరు

9492712836

ఆధునిక పోటీ ప్రపంచంలో మనిషి జీవితంలో వేగం పెరిగింది. ఫలితంగా ఒత్తిడులు కూడా ఎక్కువ అవుతున్నాయి.శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఏ ఒక్కటి ఇబ్బందుల్లో పడినా రెండోది కూడా ప్రభావితం అవుతుంది. దీర్ఘకాలిక శారీరక సమస్యలు, మానసిక స్థితి పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే మానసికంగా ప్రశాంతంగా లేని వ్యక్తి శారీరకంగా కూడా నీరసంగా మారిపోతాడు. అవయవాల పనితీరు కూడా మారిపోతుంది. కాబట్టే చాలా జాగ్రత్తగా మానసిక, శారీరక ఆరోగ్యాలను బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. 

ప్రపంచ మానసిక దినోత్సవాన్ని తొలిసారి 1992, అక్టోబర్ 10న నిర్వహించారు. 150కి పైగా దేశాలు సభ్యులుగా ఉన్న ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పట్నించి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. వివిధ దేశాల ఆరోగ్య మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రజల్లో మానసిక ఆరోగ్యం అవగాహన పెంచే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది మానసిక ఆరోగ్యం సార్వత్రిక హక్కు అనే ఇతివృత్తంతో  ఈ దినోత్సవం జరుపుతున్నారు.

శారీరక రోగాలు అనేకం ఉన్నట్లే, మానసిక సమస్యలలో పలు రకాలు ఉన్నాయి.యాంగ్జయిటీ, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్,  ఫోబియా, మానియా, స్కిజోప్రినియా, డిల్యూషన్‌ డిజార్డర్‌, స్లిప్‌ డిజార్డర్‌, ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌, సుపీరియారిటీ కాంప్లెక్స్‌, ఇల్యూషన్‌, అడిక్షన్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మానసిక ఉద్రేకాలను అణచుకోలేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు కలుగుతాయి. వీటికి తగిన చికిత్సలు కూడా ఉన్నాయి. ఎంతో మంది మానసిక వైద్యులు మానసిక రోగులకు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులోడిప్రెషన్ ఒక సాధారణ మానసిక సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 5% పెద్దలు డిప్రెషన్ బారినపడుతున్నారు.ర్యాంకుల గొడవలలో విద్యార్థులు, సరైన ఉపాధి అవకాశాలు లేక యువకులు, అప్పుల బాధతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

ఒంటరితనం, అనారోగ్యకరమైన పోటీ,అసూయ,ద్వేషం,ఎటువంటి పనిలేకపోవడం వంటివి మనలో మానసిక ఒత్తిడిని పెంచుతాయి. మెదడుకు పని చెబుతూ ఉంటే అది పదునుగా అవుతుంది. క్రాస్‌వర్డ్ పజిల్‌లు లేదా సుడోకు చేయడం, చదవడం, కార్డ్‌లు ఆడడం లేదా జిగ్సా పజిల్‌ని కలపడం వంటి మీ మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయి. పుస్తకాలు చదవడం, విషయాలు గుర్తుంచుకోవడం చేస్తూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల కూడా మెదడును చురుగ్గా ఉంచుకోవచ్చు.అదే విధంగా పాజిటివ్ గా ఉండాలి. నాయకత్వ లక్షణాలను పెంచు కోవాలి.ఎదుటి వారిని సందర్భానికి అనుగుణంగా మెచ్చుకోవాలి.

కొందరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలోచూస్తారు.ఎదుటివారు ఏమి చేసినా అపహాస్యం  చేస్తుంటారు.ఇది కూడా ఒక మానసిక లోపమే అని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొందరిలో వారసత్వంగా కూడా మానసిక సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ వంటి దేశాల్లో ఏదైనా మానసిక సమస్య వస్తే, వెంటనే వైద్యులను సంప్రదిస్తారు.కానీ మన దేశంలో ఎవరైనా మానసిక సమస్య ఉందని చెప్తే, పిచ్చి పట్టిందని ప్రచారం చేస్తారు.పైగా వాటి పరిష్కారానికి మూఢ నమ్మకాలను ఆశ్రయిస్తారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రజలకు వీటిపై అవగాహన కలుగుతుంది. వివిధ రకాల మానసిక సమస్యలపై ప్రభుత్వాలు ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area