Type Here to Get Search Results !

వరదలు విపత్తు నిర్వహణ _ Disaster Management

వరదలు విపత్తు నిర్వహణ _ Disaster Management 




పొడిగా ఉండే భూభాగం మీదకు సాధారణ పరిమితులను దాటి నీరు పొంగి ప్రవహించడాన్ని వరద అంటారు. తుఫానులు, భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తాయి. ఇటీవల ప్రకృతి వైపరీత్యాల వల్ల వరద పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. పర్యావరణానికి హాని కలిగించడం వల్ల అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు దాపురిస్తున్నాయి. దీంతో ఊహించినదాని కంటే ఎక్కువ వరదలు ఏర్పడి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి.

నదీ ప్రవాహ మార్గాల హద్దులు అంటే నది గట్లు జల ప్రవాహాన్ని నిలువరించుకోలేనప్పుడు పరీవాహకంలో ఉన్న ప్రాంతాలు నీటిలో మునిగిపోయే పరిస్థితిని వరద అంటారు.

ప్రకృతి వైపరీత్యాలన్నింటిలోనూ అతి ఎక్కువగా సంభవించేవి వరదలే. వరదలు సాధారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ, సముద్ర తీర ప్రాంతాల్లోనూ సంభవిస్తాయి.

అడవుల నరికివేత, నగరీకరణ నేలలో ఎక్కువగా నీటిని నిలిపి ఉంచే సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి.

పల్లపు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, ఆనకట్టలకు దిగువన నదీ తీరాల్లో నిర్మించిన నగరాలు మొదలైనవి వరదలకు తేలికగా గురయ్యే ప్రాంతాలు

వరదల రకాలు:

1. నదీ వరదలు

వర్షాకాలంలో తుఫాను వల్ల సంభవించే భారీ వర్షాలు నదుల్లో నీటి ప్రవాహాన్ని భారీగా పెంచుతాయి. ఈ నీటి ప్రవాహం నది నుంచి సముద్రంలో కలిసే నీటి ప్రవాహం కంటే ఎక్కువగా ఉండటం వల్ల నీరు పొంగి నది గట్టును దాటి వరద సంభవిస్తుంది.

వరద సంభవించే ముందు నది తనలో ఎంత పరిమాణంలో నీరు ఉంచుకోగలదో దాన్నే పారుదల సామర్థ్యం అంటారు.

నీటి ప్రవాహ ప్రాంతంలో ఒక సెకనులో ప్రవహించే నీటి పరిమాణాన్ని డిశ్చార్జ్‌ అంటారు.

2. తీర ప్రాంత వరద

పెద్ద అలలు, సముద్రంలో ఉప్పెన, తుఫాను, సునామీ కారణంగా తీర ప్రాంతాల్లో ఏర్పడే వరదను తీర ప్రాంత వరద అంటారు.

3. పట్టణ వరద

పట్ణణ ప్రాంతంలో నీటి పారుదల వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల భారీ వర్షం సంభవించినప్పుడు వరద ఏర్పడుతుంది.

4. మెరుపు వరద

కుండపోత భారీ వర్షం, హఠాత్తుగా మంచు కరిగి నీరు నదిలో చేరడం, ఆనకట్టలు తెగిపోవడం, కూలిపోవడం వల్ల అకస్మాత్తుగా వచ్చే వరదను మెరుపు వరద అంటారు.

5. నదీ ముఖ వరదలు

ఉప్పెన కారణంగా సముద్రంలోని నీటి ప్రవాహం నదీ నీటి ప్రవాహాన్ని వెనక్కి నెట్టిన కారణంగా వరదలు ఏర్పడతాయి.

6. ప్రమాదం కారణంగా వరదలు

అధిక పరిమాణంలో నీటిని సరఫరా చేసే గొట్టాలు పగిలిపోవడం వల్ల వరద ఏర్పడి చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోయి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది.

ప్రపంచంలో వరదలు సంభవించే ప్రాంతాలు:

ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ వరదలు సంభవిస్తాయి. అయితే పల్లపు ప్రాంతాలతో కూడిన నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌ మొదలైన దేశాలు, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన అనేక ద్వీపాలు సహజంగా వరదల ప్రభావానికి ఎక్కువ లోనవుతాయి.

తీవ్రమైన హరికేన్లు, చక్రవాతాలు, టైపూన్లను ఎక్కువగా ఎదుర్కొనే అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, ఇథియోపియా, సోమాలియా, మొజాంబిక్‌, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాల్లో ప్రతి సంవత్సరం వరదలు సంభవించే అవకాశం ఉంది.

వరదలకు కారణాలు:

రుతుపవనాల వల్ల ఎడతెగని, భారీ వర్షాల వంటి సహజ కారణాలే కాకుండా మానవ ఆధారిత అంశాలు కూడా భారతదేశంలో వరదలకు కారణమవుతున్నాయి.

భారతదేశ భౌగోళిక ప్రాంతం చాలా వరకు వరదలకు గురవుతుంది. అంతేకాక భారతదేశంలో పేలవమైన వరద నిర్మూలన లేదా నిర్వహణ చర్యలు, విపత్తు నిర్వహణలో అసమర్థత మొదలైన అంశాల కారణంగా వరదల నిర్వహణకు సమగ్ర వరదల నిర్వహణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది.

వరదలు పెరగడానికి కారణమయ్యే అంశాలు:

సహజ కారణాలు

వరదలు IPCC (Inter Govern mental Panel for Climate Change) ప్రకారం వర్షపాత సంభావ్యత, తీవ్రత, పరిధి, భవిష్యత్తులో వాతావరణ మార్పుల వల్ల ఇంకా పెరగవచ్చని తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల తుఫానుల తీవ్రత పెరగవచ్చని దీని ఫలితంగా ఫ్లాష్‌ వరదలు ఇంకా పెరగవచ్చని వెల్లడించింది.

వక్రీకృత వర్షపాత సరళి

భారతదేశంలో 80 శాతం అవపాతం జూన్‌ నుంచి సెప్టెంబర్‌ రుతుపవన సమయంలోనే సంభవిస్తుంది. ఈ సమయంలో నదులు పరీవాహక ప్రాంతాల నుంచి భారీ అవక్షేప భారాన్ని తీసుకువస్తాయి.

అంతర్జాతీయ నదులు

గంగా, బ్రహ్మపుత్ర అనేక ఉప నదులు పొరుగు దేశాల్లో జన్మించాయి. కాబట్టి ఎత్తైన పర్వత ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు రావడం వల్ల స్థలాకృతిలో ఆకస్మిక మార్పు కూడా ఉత్తర భారతదేశంలో వరదలకు కారణమయ్యే అంశం.

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) తయారు చేసిన భూకంప విపత్తు ప్రమాద సూచిక (EDRI) భారతదేశంలో సుమారు 56 శాతం విస్తీర్ణం ఒక మోస్తరు నుంచి భారీ భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. భారతదేశంలో చాలా నదీ పరీవాహక ప్రాంతాలు భూకంపం సంభవించే ప్రాంతాల్లో ఉన్నందున భవిష్యత్తులో వరదలు పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది.

మానవ కారణాలు

ప్రణాళిక రహిత అభివృద్ధి, నదీ జోన్లలో ఆక్రమణలు, వరద నియంత్రణా నిర్మాణాల వైఫల్యం, ప్రణాళిక లేని జలాశయ కార్యకలాపాలు, పేలవమైన నీటి పారుదల మౌలిక సదుపాయాలు, అటవీ నిర్మూలన, భూ వినియోగ మార్పు, నదీ పరీవాహక ప్రాంతాల్లో అవక్షేపం మొదలైన అంశాలు లేదా కారణాలు భారతదేశంలో వరదలను పెంచుతున్నాయి.

పట్టణ వరదలు

చాలా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం రావడం వల్ల పట్టణాలు, నగరాల్లో ఇటీవల కాలంలో వరదలు సంభవిస్తున్నాయి.

కారణాలు:

• జల మార్గాలు, చిత్తడి నేలలను విచక్షణా రహితంగా ఆక్రమించడం.

• కాలువల సామర్థ్యం సరిపోకపోవడం.

• పారుదల మౌలిక సదుపాయాల నిర్వహణ సరిగా లేకపోవడం.

• కాలువలు, సరస్సుల పారుదలను అడ్డుకోవడం.

• పేలవమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ.

• ప్రణాళిక లేని రహదారి ప్రాజెక్టులు.

• విపత్తు ముందు ప్రణాళిక నిర్లక్ష్యం

వరద విపత్తు నిర్వహణ దృష్టి ఎక్కువగా వరద అనంతర పునరుద్ధరణ, ఉపశమన చర్యలపైనే కేంద్రీకరించారు. చాలా జలాశయాలు, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్లాంట్లలో వరద స్థాయిని కొలవడానికి తగినంత గేజింగ్‌ స్టేషన్లు లేవు. ఇవి వరద అంచనాకు ప్రధాన భాగాలు.

ఉపరితల ప్రవాహం ఎక్కువగా ఉండే విధంగా స్వల్పకాలంలో (ఒకేరోజులో 15 సెంటీమీటర్ల కంటే ఎక్కువ) భారీ వర్షం.

తీర ప్రాంతాల ముంపునకు కారణమయ్యే బలమైన గాలులతో ఉష్ణమండల చక్రవాతాలు.

నదులు, చెరువులు, కాలువలు మొదలైన వాటి గట్లకు గండ్లు పడటం లేదా అలాంటి గట్ల మీదుగా నీరు ప్రవహించడం.

పాత నదీ మార్గాలు పూడికతో నిండిపోవడం వల్ల నదీ ప్రవాహ మార్గాలు మారిపోవడం.

పల్లపు ప్రాంతాల్లో తగినన్ని నీటి పారుదల సదుపాయాలు లేకపోవడం.

నదీ పరీవాహాల జల గ్రహణ ప్రాంతాల్లోనూ, కొండ వాలుల్లోనూ విచక్షణా రహితంగా అడవులను నరికివేయడం వల్ల అధిక జల ప్రవాహమేర్పడటం.

అసోంలోని బ్రహ్మపుత్ర లోయలోని భాగాలు, బీహార్‌, పశ్చిమబెంగాల్‌లోని దిగువ గంగాలోయ, కోసి, దామోదర్‌ నదుల పరీవాహాలు, గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతాలు వరద ప్రభావిత ప్రాంతాల పరిధిలోకి వస్తాయి.

దేశంలో వరదల వల్ల జరిగే విధ్వంసంలో దాదాపు 60 శాతానికి నదుల వల్ల వచ్చే వరదలు కారణం కాగా మిగిలిన 40 శాతానికి భారీ వర్షపాతం, చక్రవాతాలు కారణమవుతున్నాయి.

దేశంలో జరిగే నష్టంలో 60 శాతానికి హిమాలయ నదులే కారణం. ద్వీపకల్ప నదీ పరీవాహకంలో జరిగే నష్టంలో అధిక భాగానికి చక్రవాతాలు కారణం కాగా హిమాలయ నదీ పరీవాహకాల్లో దాదాపు 66 శాతానికి వరదలు, 34 శాతానికి భారీ వర్షాలు కారణమవుతున్నాయి.

జాతీయ వరద నివారణ కార్యక్రమాన్ని 1954లో ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు వరద నివారణ బోర్డులను ఏర్పాటు చేశాయి. ఈ బోర్డుల పనిని కేంద్ర వరద నివారణ బోర్డు సమన్వయం చేస్తుంది.

పంచవర్ష ప్రణాళికల కాలంలో చేపట్టిన బహుళార్థసాధక ప్రాజెక్టుల లక్ష్యాల్లో వరద నివారణ కూడా ఒకటి.

వరద నివారణ కేంద్రాలు:

• తపతి నది మీద సూరత్‌

• నర్మద నది మీద బ్రోచ్‌

• గంగా నది మీద వారణాసి, బక్సర్‌, పాట్నా

• బ్రహ్మపుత్ర నది మీద డిబ్రూఘర్‌, గువాహటి

• సువర్ణరేఖ నది మీద భువనేశ్వర్‌

• చంబల్‌ నది మీద గాంధీనగర్‌ ప్రాంతాల్లో వరద సూచిక, హెచ్చరిక కేంద్రాలున్నాయి.

ప్రపంచంలోని తీవ్ర వరద ప్రభావిత దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. వరదలకు ప్రధాన కారణం ప్రకృతి స్వభావం.

భారతదేశ సగటు వర్షపాతం 1150 మిల్లీమీటర్లు అయితే దేశవ్యాప్తంగా వర్షపాతం రకరకాలుగా ఉంది. వార్షిక వర్షపాతం పశ్చిమ తీర, పశ్చిమ కనుమలు, కశ్మీర్‌ కొండలు, బ్రహ్మపుత్ర లోయలో 2500 మిల్లీమీటర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి.

వరదల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

• వరద సమయాల్లో డయేరియా ప్రబలినప్పుడు టీ, గంజి, లేత కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.

• వరదల సమయంలో నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్‌ బిళ్లలు వాడాలి.

• రేడియో, టీవీల్లో ప్రభుత్వం ఇచ్చే వరద హెచ్చరికలను తెలుసుకోవాలి.

• విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేసుకోవాలి.

• ప్రభుత్వ శిబిరాలకు తరలివెళ్లాలి.

• వరదల్లో నడవవలసి వస్తే పొడవాటి కర్ర సహాయంతో దారి చూసుకుంటూ నడవాలి.

• ఇంటిలో సామగ్రిని ఎత్తైన అటకలపై పెట్టాలి.

• క్లోరినేషన్‌ చేసిన నీటినే తాగాలి. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి.

వరదల వైపరీత్య మ్యాపులు:

వరద వైపరీత్య మ్యాపులను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI) రూపొందిస్తుంది.

ఆ మ్యాపులో నిషేధిత ఆంక్షలతో కూడిన హెచ్చరికలతో కూడిన వరద రహిత మండలాలను సూచిస్తుంది.

వరదలకు సంబంధించిన అంశాలపై జరిపిన అధ్యయనాలను కేంద్ర జల సంఘం, జల వనరుల అభివృద్ధి ప్రాజెక్టు అథారిటీలు, పట్టణ గ్రామీణ అథారిటీలు, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖలు వినియోగించుకుంటున్నాయి.

ప్రపంచంలో అత్యధిక వరద ముప్పును ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ ఒకటి. భారతదేశంలో వరదలకు రుతు పవనాలు అధిక పూడిక కలిగిన నదులు, వాలుగా ఉన్న ఎక్కువగా కోసుకుపోయిన హిమాలయ పర్వత శ్రేణులు వంటివి ముఖ్య కారణమవుతున్నాయి. భారతదేశ భూభాగంలో సుమారు 12 శాతం (140 మిలియన్‌ హెక్టార్లు) వరద ముంపు కలిగి ఉంది. దేశంలో మొత్తం మీద 39 జిల్లాలను తీవ్ర వరద ముప్పు ఉన్న జిల్లాలుగా గుర్తించారు. గంగ, బ్రహ్మపుత్ర నదులు అత్యధిక వరదలకు కారణమవుతున్నాయి. దేశంలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నైరుతి రుతుపవనాల కాలంలో వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area