బీబీఏ బిజినెస్ అనలిటిక్స్. ప్రయోజనం ఎంత?
బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ చదివిన వారికి సాధారణ బీబీఏతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనాలే ఉంటాయి. కేవలం మేనేజ్మెంట్ సిద్దాంతాలకే పరిమితం. కాకుండా, వ్యాపార సమస్యలను డేటా ద్వారా ఎలా పరిష్కరించాలి అనే దాని పై ప్రాక్టికల్ అవగాహన వస్తుంది. మార్కెట్ ట్రెండ్స్ విశ్లేషణ, వినియోగదారుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం, ఖర్చులు- లాభాల విశ్లేషణ చేయడం లాంటి నైపుణ్యాలు ఈ కోర్సు ద్వారా అభివృద్ధి చెందుతాయి.
• ఎంఈసీ గ్రూపుతో గ్రూపుతో ఇంటర్మీడియట్ తర్వాత సీఏ, సీఎంఏ, బీబీఏ, బీకాం, బీఏ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ లాంటి కోర్సులను ఎంచుకోవచ్చు. ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ కోర్సు ఎంఈసీ విద్యార్థులకు ఆధునిక, భవిష్యత్తు అవకాశాలతో కూడిన డిగ్రీగా మారింది. వ్యాపార నిర్ణయాలను డేటా విశ్లేషణ ఆధారంగా తీసుకోవడం ఈ కోర్సు ప్రధాన లక్ష్యం.
• బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ మేనేజ్మెంట్ విద్యతో పాటు స్టాటిస్టిక్స్, లాజికల్ అనాలిసిస్, డేటా అర్ధం చేసుకునే నైపుణ్యాలను కలిపి నేర్పించే కోర్సు ఎంఈసీ గ్రూపులో చదివిన మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ ప్రోగ్రాంకు బలమైన పునాదిని ఇస్తాయి. సంఖ్యలతో పని చేయడం, లాజికల్ థింకింగ్, వ్యాపార పరిస్థితులను విశ్లేషించడం లాంటి లక్షణాలు ఉన్న విద్యార్థులకు బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ చాలా అనుకూలంగా ఉంటుంది.
• భారతదేశంలో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ లేదా అనలిటిక్స్ ఫోకస్ ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తున్న మేటి సంస్థలెన్నో ఉన్నాయి. ఈ కోర్సును పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ సంస్థల్లో ఇండస్ట్రీ ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్ అవకాశాలు ఉండటం వల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం లభిస్తుంది. క్రైస్ట్ యూనివర్సిటీ-బెంగళూరు, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ-పుణె, ఫ్లేమ్ యూనివర్సిటీ-పుణె, గీతం యూనివర్సిటీ- విశాఖపట్నం, కేఎల్ యూనివర్సిటీ-గుంటూరు, జైన్ యూనివర్సిటీ-బెంగళూరు, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ-బెంగళూరు.. ఈ కోర్సు అందించే సంస్థల్లో ముఖ్యమైనవి. అయితే కాలేజీ ఎంపికలో పేరు మాత్రమే కాకుండా కోర్సు కంటెంట్, ప్రాక్టికల్ ట్రెయినింగ్, ప్లేస్మెంట్ రికార్డు తప్పనిసరిగా పరిశీలించాలి.
• బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ పూర్తిచేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా విస్తృతంగా ఉన్నాయి. జూనియర్ బిజినెస్ అనలిస్టు, డేటా అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్, మార్కెట్ రిసెర్చ్ అనలిస్టు, ఆపరేషన్స్ అనలిస్టు, మేనేజ్మెంట్ ట్రెయినీ లాంటి ఉద్యోగాల్లో చేరవచ్చు. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ-కామర్స్, రిటైల్, కన్సల్టింగ్ సంస్థలు వీరిని ఎక్కువగా నియమిస్తున్నాయి. ప్రారంభ దశలోనే సాధారణ బీబీఏతో పోలిస్తే మెరుగైన వేతనమూ పొందే అవకాశం ఉంటుంది.
• డిగ్రీ తర్వాత ఉన్నత విద్య వైపు వెళ్లాలనుకునే వారికీ ఈ కోర్సు మంచి దారి చూపిస్తుంది. ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఫైనాన్స్, మార్కెటింగ్ లాంటి కోర్సులు చేయవచ్చు. అలాగే డేటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ అనలిటిక్స్కు సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సులు చేస్తే ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఉద్యోగం చేస్తూనే పార్ట్టైమ్ లేదా ఆన్లైన్ పీజీ కోర్సులు చేయడం ద్వారా కెరియర్ను వేగంగా ముందుకు తీసుకెళ్లవచ్చు.
• ఎంఈసీ గ్రూపుతో ఇంటర్ చదువుతున్న విద్యార్ధికి బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఒక ప్రయోజనకరమైన, భవిష్యత్ దృష్టితో కూడిన కోర్సు, సరైన సంస్థను ఎంచుకుని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే మంచి ఉద్యోగాలు, స్థిరమైన కెరియర్ సాధించవచ్చు. డేటా ఆధారిత నిర్ణయాలు కీలకమైన ఈ కాలంలో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ డిగ్రీకి మంచి డిమాండ్ ఉంది.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,
కెరియర్ కౌన్సెలర్
.jpeg)