Type Here to Get Search Results !

మంచి అలవాట్లతో మేటి భవిత

 మంచి అలవాట్లతో మేటి భవిత



కొత్త సంవత్సరంలో దాదాపు విద్యార్థులంతా ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటారు. బాగా చదవాలి, మంచి మార్కులు పొందాలి, వ్యాయామం చేయాలి, ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి, నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి... ఇలా ఎన్నో అనుకుంటారు. వీటిని జనవరి ప్రారంభంలో విజయవంతంగా అమలుచేస్తారు కూడా. ఆ తర్వాతే నెమ్మదిగా దారి తప్పుతారు. అలా జరగకుండా ఉండాలంటే?

🔹పాత ఆలోచనలు, ఆలవాట్లు వదిలించుకోవడం కష్టమే. అయితే వాటిని వదిలేసినప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది. మనకు తెలియకుండానే మనలో ఏర్పడే రోజువారీ అలవాట్లే కాలక్రమేణా పెద్ద మార్పులకు కారణమవుతాయని, లక్ష్యాలతో పాటు అలవాట్లూ ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

🔹"నాకు ఈ సబ్జెక్టు రాదు", "నేను లీడర్ని కాలేను", "పరీక్షల్లో మంచి మార్కులు సాదించలేను' లాంటి ఆలోచనలు విద్యార్థులను వెనక్కి లాగుతుంటాయి. అందువల్ల నాకు రాదు, నా వల్ల కాదు అనే భావనలను మనసులోంచి తీసేయాలి. ప్రయత్నిస్తే కచ్చితంగా నేర్చుకోగలను అనే నమ్మకం ఉండాలి. ఒకరోజు చదవకపోయినా నిరుత్సాహపడకుండా మరుసటి రోజు మళ్లీ మొదలు పెట్టాలి. ప్రతి రోజూ ఎంతో కొంత సమయం చదవడానికి కేటాయించడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి.

🔹చదవడం పూర్తయిన తర్వాత మర్చిపోకుండా ఉండటానికి పునశ్చరణ చేసుకోవాలి. నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాయడం వల్ల అవగాహన పెరుగుతుంది. అలాగే వారంలో ఒక రోజైనా కష్టమైన ప్రశ్నలు, సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

🔹కొన్నిసార్లు లక్ష్యం ప్రకారం కేటాయించుకున్న పూర్తి సమయాన్ని చదవడానికి కేటాయించలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో నిరుత్సాహానికి లోనుకాకుండా.. ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి సారించాలి. చదివే వ్యవధిని నెమ్మదిగా పెంచుకోవాలి. దీంతో కొద్ది రోజుల్లోనే మెరుగుపడి, మీరు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం చదవడం సాధ్యమవుతుంది.

🔹బాగా చదువుకోవాలంటే మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యం. ప్రతి రోజూ నిర్ణీత వేళల్లో నిద్ర పోవడమూ ప్రధానమే. ఫోన్ చూడటానికి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించుకుని, దానికే పరిమితం కావాలి. దీంతో ఎలాంటి అవాంతరాలూ, లేకుండా చదువుకోవడానికి వీలవుతుంది. చదువుకునే సమయంలో ఫోన్ అందుబాటులో లేకుండా చూసుకోవడమే మంచిది.

🔹ఆరోగ్యం ఎంతో ప్రధానం. పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాలు, గుడ్లు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. జంక్ఫుడ్, చిప్స్, కూల్డ్రింక్స్ ఇవన్నీ తగ్గించాలి. ఆరోగ్యంగా ఉంటేనే కోరుకున్న విధంగా చదువూ కొనసాగుతుంది.

🔹రోజూ కొద్ది సేపు వ్యాయామం చేయాలి. నడవడం, యోగా, ఆటలు శరీరానికి చాలా మంచివి. వీటితో మానసికంగానూ మెరుగుపడవచ్చు. అలా అని చెప్పి. ఒకేసారి ఎక్కువగా చేయకూడదు. నిర్ణీత వ్యవధుల్లో క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఇలా కొన్నాళ్లు కొనసాగిస్తే ఇదే ఒక అలవాటుగా మారుతుంది.

🔹వారానికి లేదా నెలకొకసారి అయినా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం 20 నిమిషాలు చదవాలి. ఆసక్తి ఉన్న పుస్తకాలు ఎంచుకుని చదవడాన్ని నిరంతరం కొనసాగించాలి. పఠనం ఎన్నో నైపుణ్యాలను పెంచుతుంది.

నూతన సంవత్సర సంకల్పాలు మంచివే. అయితే మన రోజువారీ అలవాట్లు, ఆలోచనా విధానం అంతకంటే ముఖ్యమైనవి. ఈ మార్పులతోనే జీవితం మారుతుంది. అవసరం లేనివి నెమ్మదిగా వదిలించుకుని, సరైన అలవాట్లను నిర్మించుకోవడమే నిజమైన విజయానికి పునాది అవుతుంది. తీర్మానాలు కొద్ది రోజులే ప్రభావం చూపుతాయి. కానీ అలవాట్లు జీవితాంతం ఉపయోగపడతాయి. సరైన అలవాట్లతో ఈ ఏడాదిని తీర్చిదిద్దుకుంటే అనుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతారు. చిన్న చిన్న అలవాట్లే భవిష్యత్తులో ఎంతో ఉన్నతి, పరిణతికి దారిచూపుతాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area