కోర్సు పూర్తయిన వెంటనే కొలువులు అందించే చదువులు
కోర్సు పూర్తయిన వెంటనే కొలువులు అందించే చదువులు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో చెప్పుకోదగ్గవి ప్లాస్టిక్ డిప్లొమాలు. తక్కువ వయసులోనే సత్వర ఉపాధి పొందాలనుకునేవారికి ఇవి హామీగా నిలుస్తాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) వీటిని అందిస్తోంది. ఈ సంస్థ హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా 29 కేంద్రాల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్టు డిప్లొమా కోర్సులు నడుపుతోంది. వీటిలో ప్రవేశాలకు ఇటీవలే ప్రకటన వెలువడింది.
దైనందిన జీవితంలో ప్లాస్టిక్కు ఎంతో ప్రాధాన్యముంది. మనం ఉపయోగిస్తున్న దాదాపు అన్ని వస్తువుల్లోనూ ఇది ఒక భాగమైంది. తేలిక, మన్నిక, సౌకర్యవంతం, తక్కువ ధరలో రూపొందడం.. ఇలా పలు కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది. కోరుకున్న రూపంలోకి సులువుగా మారిపోవడం దీని ప్రత్యేకత. విస్తృత ప్రయోజనాల రీత్యా పరిశ్రమలు పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ను వినియోగిస్తున్నాయి. అలాగే ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగం కావడానికి ప్లాస్టిక్ టెక్నాలజీపై పట్టున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ప్లాస్టిక్, అనుబంధ విభాగాల్లో మేటి మానవ వనరులను పరిశ్రమలకు అందించే లక్ష్యంతో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చెన్నైలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ఏర్పాటైంది. గతంలో దీన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీగా పిలిచేవారు. ఈ సంస్థకు అనుబందంగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో డిప్లొమా, పోస్టు డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. పరీక్షలో ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది.
అవకాశాలిలా...
ప్లాస్టిక్ డిప్లొమాలు పూర్తి చేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో మేటి సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఓఎన్ జీసీ, ఓల్ట్రాస్, మిల్టన్, సెలో, ఎల్అండ్, మారుతీ సుజుకీ, రిలయన్స్, ఐఎఫ్బి, బీపీఎల్, హెచ్సీఎల్, ఏషియన్ పెయింట్స్, బటరై, టాటా.. తదితర సంస్థలు వీరిని ఎంపిక చేసుకుంటున్నాయి. ఆటోమోటివ్, ప్యాకేజింగ్, కన్జూమర్ గూడ్స్, మెషీన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆర్ అండ్ డీ తదితర విభాగాలకు చెందిన సంస్థల్లో సేవలందించడానికి ప్లాస్టిక్పై పట్టున్నవారు అవసరం. అందువల్ల ఈ కోర్సులు చదివినవారి ఉపాధికి డోకా లేదు. కొన్నేళ్ల అనుభవంతో మెరుగైన వేతనాలూ అందుకోవచ్చు. సొంతంగానూ చిన్న పరిశ్రమను నెలకొల్పవచ్చు.
ఎక్కడంటే...
డిప్లొమా, పోస్టు డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను దేశవ్యాప్తంగా 29 సివెట్ కేంద్రాల్లో అందిస్తున్నారు. ఇవి.. హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, అమృత్సర్, ఔరంగాబాద్, బడ్డీ, బాలాసోర్, బోపాల్, భువనేశ్వర్, చంద్రపుర్, చెన్నై, దేహ్రాడూన్, గువాహటి, హాజీపుర్, హల్దియా, ఇంపాల్, జయపుర్, కొచి, లఖ్్నపూ. మదురై, మురల్, మైసూరు, రాయ్పుర్, రాంచీ, కోర్బ, అగర్తల, గ్వాలియర్, వారణాసి, భగల్ఫర్లలో ఉన్నాయి.
పరీక్ష
అన్ని కోర్సులకూ పరీక్షను ఆన్లైన్లో విడిగా నిర్వహిస్తారు. దీని వ్యవధి 60 నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. మొత్తం యాభై ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు. మాదిరి ప్రశ్నలు సిపెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలించి, ప్రశ్నాంశాలపై అవగాహన పెంచుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్ విభాగంలో స్పోర్ట్స్, హిస్టరీ, పాలిటిక్స్ కంప్యూటర్ సైన్స్, ఎంటర్టైన్మెంట్, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వస్తాయి. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో సైన్స్, ఇంగ్లిష్ ప్రశ్నలు పదో తరగతి సిలబస్ స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల పాఠ్యపుస్తకాలు బాగా చదువుకున్నవారు ఎక్కువ మార్కులు పొందవచ్చు. (సిపెట్ లో బీటెక్ కోర్సులూ ఉన్నాయి. ప్లాస్టిక్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్, పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ కోర్సులు బీటెక్లో భాగంగా అందిస్తున్నారు. అలాగే ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్ డీ కోర్సులూ ఇక్కడ చదువుకోవచ్చు. వీటిలో ప్రవేశాలకు విడిగా ప్రకటన వెలువడుతుంది.
కోర్సులు, అర్హత, పరీక్ష వివరాలు...
కోర్సు: డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్
వ్యవధి: మూడేళ్లు (6 సెమిస్టర్లు)
అర్హత: పదో తరగతి/ సమాన స్థాయి ఉత్తీర్ణత. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నవారూ అర్హులే.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 25, సైన్స్ 20, ఇంగ్లిష్ 5 ప్రశ్నలు వస్తాయి.
➖➖➖➖➖➖➖
కోర్సు: డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ)
వ్యవధి: మూడేళ్లు (6 సెమిస్టర్లు)
అర్హత: పదో తరగతి/ సమాన స్థాయి ఉత్తీర్ణత. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నవారూ అర్హులే.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 25, సైన్స్ 20, ఇంగ్లిష్ 5 ప్రశ్నలు వస్తాయి.
➖➖➖➖➖➖➖
కోర్సు: పోస్టు డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్/క్యామ్ (పీడీ-పీఎండీ)
వ్యవధి: 18 నెలలు (3 సెమిస్టర్లు)
అర్హత: మెకానికల్/ ప్లాస్టిక్ టెక్నాలజీ/ టూల్/ప్రొడక్షన్/ ఆటోమొబైల్/ మెకట్రానిక్స్, టూల్ డ్రై అండ్ మేకింగ్/ సివెట్ నుంచి డీపీఎంటీ/ డీపేటీ వీటిలో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా ఉండాలి. చివరి ఏడాది కోర్సులో ఉన్నవారూ అర్హులే.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 20, సైన్స్ 10, ఇంగ్లిష్ 10, సంబందిత డిప్లొమా నుంచి 10 ప్రశ్నలు వస్తాయి.
➖➖➖➖➖➖➖
కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ)
వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు)
అర్హత: ఏదైనా సైన్స్ డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి ఏడాది విద్యార్థులూ అర్హులే.
పరీక్షలో: జనరల్ నాలెడ్జ్ 20, సైన్స్ 10, ఇంగ్లిష్ 10, బీఎస్సీ స్థాయి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్ 10 ప్రశ్నలు వస్తాయి.
✅ పై కోర్సులన్నీ హైదరాబాద్ క్యాంపస్లో అందిస్తున్నారు. పీడీ-పీఎండీ తప్ప మిగతా మూడూ విజయవాడ క్యాంపస్లో ఉన్నాయి. అన్ని కోర్సులకూ ఏ వయసు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుకు గడువు తేదీ: మే 28.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.250. మిగిలిన అందరికీ రూ.500.
పరీక్ష తేదీ: జూన్ 7
వెబ్ సైట్: https://www.cipet.gov.in/
.jpeg)