Type Here to Get Search Results !

పైలట్ అవ్వాలంటే...?

 పైలట్ అవ్వాలంటే...?



ఎంపీసీతో ఇంటర్ పూర్తయ్యాక భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) నిర్దేశించిన ప్రమాణాలు అంటే ఎత్తు. బరువు, ఆరోగ్యం ఉండాలి. పైలట్ శిక్షణలో మొదటిది స్టూడెంట్ పైలట్ లైసెన్స్, రెండో దశలో ప్రైవేట్ పైలట్ లైసెన్స్ పొందుతారు. అయితే పైలట్గా ఉద్యోగం చేయాలంటే అత్యంత కీలకమైంది కమర్షియల్ పైలట్ దీన్ని పొందాలంటే థియరీ, ప్రాక్టికల్ శిక్షణ రెండూ తప్పనిసరి. థియరీ తరగతుల్లో విమాన నావిగేషన్, వాతావరణ విజ్ఞానం, విమాన నియమాలు, ఇంజిన్ పరిజ్ఞానం లాంటి అంశాలను లోతుగా నేర్పిస్తారు. ప్రాక్టికల్ శిక్షణలో కనీసం రెండు వందల గంటల పాటు విమానం నడిపిన అనుభవం పొందాలి.

▪️పదో తరగతిలో ఉన్నప్పుడే భవిష్యత్తులో పైలట్ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ప్రశంసనీయం. పైలట్ కేవలం ఉద్యోగం మాత్రమే కాదు. అధిక బాధ్యత, నైపుణ్యం, క్రమశిక్షణ, ధైర్యం, నిర్ణయాత్మక సామర్థ్యంతో కూడిన గౌరవప్రదమైన వృత్తి సరైన ప్రణాళికతో, దశల వారీగా ముందుకు సాగితే ఈ లక్ష్యాన్ని తప్పకుండా సాధించవచ్చు.

▪️పైలట్ కావాలంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, పిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాలి. ఇవి విమానాల పని విధానం, వేగం, దిశ, ఎత్తు, ఇంజిన్ సంబంధిత అంశాలను అర్ధం చేసుకోవడానికి పునాదిగా ఉపయోగపడతాయి.

▪️దేశంలో పైలట్ శిక్షణ అందించే అనేక గుర్తింపు పొందిన సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడెమీ పేరున్న సంస్థ. దేశవ్యాప్తంగా అనేక ప్రైవేట్ ఫ్లయింగ్ స్కూల్స్ శిక్షణను అందిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో శిక్షణ పొందేందుకు పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా యాభై లక్షల రూపాయలు అవసరం అవుతాయి.

▪️ప్రైవేట్ సంస్థల్లో పైలట్ శిక్షణ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందడానికి అరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కావాలి.

▪️కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో కో-పైలట్గా కెరియర్ ప్రారంభమవుతుంది. అనుభవం పెరిగే కొద్దీ కెప్టెన్ స్థాయికి చేరుకోవచ్చు. అదేవిధంగా హెలికాప్టర్ పైలెట్గా, ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా లేదా రక్షణ రంగంలోనూ సేవలు అందించవచ్చు.

▪️కమర్షియల్ పైలట్ కావడానికి ఎక్కువ ఫీజు అవసరం. కాబట్టి, భారత వాయుసేనలో ఖర్చు లేకుండా పైలట్ కావడానికి ప్రయత్నించవచ్చు. ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారికి నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ద్వారా ఎంపిక, శిక్షణ జరుగుతాయి. అలాగే డిగ్రీ విద్యార్హతతో సీడీఎస్ఈ, ఏఎఫ్క్యట్లతో అవకాశం ఉంటుంది. ఎంపికలో అభ్యర్థి ప్రతిభ, వ్యక్తిత్వం, సృజనాత్మకత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, శారీరక ఫిట్నెస్, చూపు, వినికిడి లాంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. 

▪️ఎంపికైన వారికి వాయుసేన శిక్షణ కేంద్రాల్లో అత్యంత కఠినమైన పైలట్ శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థి ప్రతిభను బట్టి యుద్ధ విమానాలు, రవాణా విమానాలు లేదా హెలికాప్టర్లకు కేటాయిస్తారు. శిక్షణ కాలంలోనూ స్టైపెండ్, వసతి, భోజనం, వైద్య సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తుంది.

▪️శిక్షణ మొత్తం ప్రభుత్వ ఖర్చుతోనే జరుగుతుంది. అనంతరం ఉద్యోగంలో ఆకర్షణీయ వేతనం, ఇతర ప్రోత్సాహకాలు, నివాస సౌకర్యాలు, వైద్య సదుపాయాలు లభిస్తాయి. పదవీ విరమణ తర్వాత కూడా పౌర విమానయాన రంగంలో మంచి అవకాశాలూ అందుబాటులో ఉంటాయి.

చివరిగా... పైలట్ కావడం సులభమైన మార్గం కాదు. కానీ, అసాధ్యం మాత్రం కాదు. స్పష్టమైన లక్ష్యం, క్రమశిక్షణతో కూడిన చదువు, సరైన శిక్షణ, మంచి ఆరోగ్యం ఉంటే ఈ కల నెరవేరుతుంది. దేశానికి సేవ చేస్తూ ఆకాశంలో ఎగరాలనుకొనే యువతకు పైలట్ వృత్తి ఒక అద్భుతమైన అవకాశం.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area