విద్య ఇక్కడ... ఉద్యోగాలు విదేశాల్లోనా..!
భారతదేశంలో ఉత్తమమైన విద్యాభ్యాసంలో పరిపూర్ణత సాధించిన కొందరు విద్యావంతులు దేశంలో సామాజిక ఆర్థికశాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రతిభను చాటుతున్న అప్పటికి, కొన్ని దశాబ్దాలుగా దేశంలోని ప్రముఖ సాంకేతిక కళాశాలలో అభ్యసించిన విద్యార్థులు మరికొందరు ప్రతిభనైపుణ్యం కలిగి ఉండి విదేశాల్లో ఉద్యోగాల కొరకు వెళ్తున్న క్రమంలో స్వదేశానికి ఉపయోగపడవలసిన అత్యున్నతమేధా శక్తిని విదేశాలు అందిపుచ్చుకుంటూ ఉన్నాయా అనే సంశయం కలగకమానదు.
కారణాలు ఏవైనా విదేశాల్లో వేతనాలు ఎక్కువగా ఉంటున్నాయా లేక ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటున్నాయా అనే భావనతోనైనా కావచ్చేమో నిజమైనా కాకపోయినా భారతదేశంలోని శాస్త్ర ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి చాలామంది విద్యావంతులు విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారా అనే సంశయం కలగకమానదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి దేశంలోని ప్రజలలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండేదని గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో ఆర్ధిక వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉండడం ఒకవైపు, పేదరికం మరోవైపు. ఆర్థిక వ్యవస్థ అనుకున్న రీతిలోలేకపోవడం వల్ల అధిక స్థాయిలో విద్యా ప్రమాణాలను అందరికీ అందించడంలో కొంత ఆలస్యంగా జరిగిందనే భిన్న వాదనలు సమాజంలో లేకపోలేదు.
తద్వారా ప్రజలు ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించేవారు. అనంతరం జరిగిన పరిణామ క్రమంలో గణనీయంగా విద్యకు ప్రాముఖ్యత అవసరం కావడం దేశాభివృద్ధిలో అక్షరాస్యతక్రమం ప్రధానంగా మారింది. ప్రభుత్వాలు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో క్రమేణా దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన బోధకులచేత విద్య అభ్యసించిన వారిసంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ భారతదేశ జనాభాలో గణనీయంగా అక్షరాస్యత శాతం పెరుగుతూ వస్తున్నది. ఎక్కువగా ఇంజనీరింగ్ విద్యావ్యవస్థకు భారతదేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలు ఉత్తమమైన నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
దీనివల్ల ఇంజినీరింగ్ వ్యవస్థ అనేది భారతదేశంలో విసృతంగా ఉపాధి అవకాశాలు ఉన్న వ్యవస్థగా మారింది. ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థులు డిగ్రీలు పుచ్చుకొని స్వదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. అయితే చాలావరకు భారతదేశంలోని ఇంజి నీరింగ్ చదివి ప్రతిభా నైపుణ్యం ఉన్న వారిని స్వదేశంలో ఉపాధి కంటే విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఆకర్షించయో ఏమోకానీ చాలామంది ఉన్నత విజ్ఞానవంతులు కూడా భారత దేశాన్నివిడిచి ఆసియా, ఆసియా దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా , యూరప్ లాంటి అనేక దేశాల్లో ఉన్న ప్రముఖ సంస్థల్లో పారిశ్రామిక వాణిజ్య వ్యవస్థలలో చేరడానికి స్వదేశంలో చదివిన నాణ్యమైన విద్య విదేశాల్లో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందనే భిన్నాభిప్రాయాలు లేకపోలేదు.
దీనితో భారతదేశంలో ఉన్న సాంకేతిక విద్యావ్యవస్థకు అగ్రదేశాలు, పాశ్చాత్య దేశాల్లో కూడా మంచి విలువలు ఉంటున్నాయి. అనే వాదనలు బలపడుతూ వస్తున్నాయి. ప్రాచీన కాలం నుండి అనేక సంస్కృతి సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలయమై ఉన్న భారత దేశంలో బహుముఖ ప్రజు కలిగినటువంటి అనేకమంది విజ్ఞానవేత్తలు, జ్ఞానులు తత్వ వేత్తలు, రాజకీయ వేత్తలు మరెందరో ప్రముఖులు భారతదేశ ప్రాచీన ఆధునిక చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయి భారతదేశం ప్రఖ్యాతి ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసినవారు లేకపోలేదు.
ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశం విద్యాపరంగా ప్రపంచవ్యాప్తంగా మూల బిందువుగా ఉండేదనినలందా, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల్లో అనేక దేశాల నుండి అభ్యాసకులు వచ్చి విద్యను అభ్యసించి వెళ్లే వారని చరిత్ర కారులు చెపుతారు. కానీ భిన్నంగా తరచుగా స్వదేశంలో ఉన్న విద్యావంతులు వేరేదేశాల్లో ఉన్నత చదువులకు ఉద్యోగాలకు వలసలు వెళుతున్న దృశ్యాలు అడపాదడపా గోచరిస్తుండడం ఆశ్చర్యకరం.
సుమారు మూడు దశాబ్దాల నుండి చాలామంది భారతదేశంలో ఇంజినీరింగ్ విద్యలో పరిపూర్ణమైన నైపుణ్యత గల విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి అమెరికా ఆస్ట్రేలియా యూరప్ దేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం, చాలామంది ఆయాదేశాల్లో పౌరసత్వం తీసుకుని స్థిరపడడం కూడా జరుగుతూ వచ్చింది. దీనితో స్వదేశంలో ఉత్తమమైన విద్యను అభ్యసించి సాంకేతిక రంగాల్లో నిపుణత కలిగిన ప్రతిభావంతుల నైపుణ్యతను మేధా సంపత్తిని పాశ్చాత్య దేశాలు విరివిగా ఉపయోగించుకుంటు న్నాయా అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.
కానీ స్వదేశం మీద అభిమానం కలిగి అనేక విషయాలపై నిపుణత కలిగిన విద్యావంతులు, మేధావులు, అన్నిరంగాల్లో క్షేత్రస్థాయి లో అత్యున్నతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకుపోతున్న వారు లేకపోలేదు. అలాంటి వారు విదేశాలకువెళ్లి ఏదో సాధించుకోవాలని కాకుండా దేశభక్తి, దేశ అభిమానంతోపాటు దేశా నికి ఎంతో కొంత సేవచేయాలని వారికున్న జ్ఞానాన్ని స్వ దేశానికి అంకితపరుస్తూ శాస్త్రవేత్తలుగా, వైద్యులుగా, ఇంజినీర్లుగా, అనేక రకాలైనటువంటి టెక్నీషియన్లుగా, పరిశోధకులుగా మరెన్నో విషయాలలో తమవంతు కృషి చేస్తుండడం శుభపరిణామం.
స్వదేశంలో ఉత్తమమైన విద్యను, పరి పూర్ణ విజ్ఞానాన్ని సంపూర్ణంగా నేర్చుకుంటున్న యువత భారతదేశ పురోగతిలో సమాజ అభివృద్ధి కొరకు తోడ్పడే విధంగా మరింతగా తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంది. అయినప్పటికీ, చాలావరకు స్వదేశంలో ఉన్నతవిద్యను అభ్య సించిన యువత విదేశాల వైపు పరుగులు పెడుతుండడం సర్వసాధనమైపోతుందా అనిపిస్తుంది. ఈవిధానంలో పాశ్చాత్య దేశాలఅభివృద్ధిలో భారతీయ మేధావులు ఆయాదేశాల్లో వివిధ రంగాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు ఆవుతున్నారా అనే సంశయం కలగక మానదు.
ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో అత్యున్నతమైన మేధాసంపత్తి కలిగిఅన్ని రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి ప్రతిభావంతులు మారు తున్నకాలానికి అనుగుణంగా స్వదేశంలోనే అధునాతన శాస్త్ర సాంకేతిక పోకడలతో మరింతగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ఆశించడంలో సందేహంలేదేమో.
- దాడిశెట్టి శ్యామ్ కుమార్
.jpeg)